December 22, 2024





                   దేశ ఆర్ధిక రాజధాని  ముంబయిలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తనిఖీలు చేపట్టగా.. బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ నివాసంలోని స్విమ్మింగ్‌ పూల్‌లో డెంగీని వ్యాప్తి చేసే దోమలు పెరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆయనకు నోటీసులు జారీ చేశారు. మరో నటి విద్యాబాలన్‌కు డెంగీ సోకినట్లు సమాచారం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
సాధారణ తనిఖిల్లో భాగంగా జుహు తారా రోడ్డులోని షాహిద్‌ కపూర్‌ నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ను అధికారులు పరిశీలించారు. షాహిద్‌ వ్యక్తిగత స్విమ్మింగ్‌పూల్‌లోని నీటిని పరిశీలించగా.. అందులో డెంగీని వ్యాప్తి చేసే దోమలు పెరుగుతున్నట్లు తేలింది. చాలా రోజులుగా నీటికి మార్చకపోవడం వల్ల దోమలు వృద్ధి చెందాయని అధికారులు వెల్లడించారు. దీంతో షాహిద్‌కు నోటీసులు జారీ చేశారు. అదే అపార్ట్‌మెంట్‌లోని మరో నివాసంలో కూడా డెంగీ దోమలు పెరుగుతున్నట్లు గుర్తించడంతో వారికి కూడా నోటీసులు పంపించారు. కాగా.. షాహిద్‌ నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లోనే ఉంటున్న బాలివుడ్‌ నటి విద్యాబాలన్‌ అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించగా .. డెంగీ సోకినట్లు తేలిందని సమాచారం. విద్యాబాలన్‌ అనారోగ్యానికి గురవడంతోనే బీఎంసీ అధికారులు ఆ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై స్పందించేందుకు అధికారులు నిరాకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *