September 15, 2016

పోరాడే యోధుడు మన పవన్ కళ్యాణ్..!

             
                    కాకినాడలో ఓ వైపు సముద్రపు హోరు... మరో వైపు పవన్ కళ్యాణ్ అభిమాన జనసందోహపు హోరు... చల్లబడిన వాతావరణంలో గాలి వేడెక్కింది. పవన్ కళ్యాణ్ ను ఒక్కసారి దగ్గర నుంచి చూడాలన్న తపనతో అభిమాన లోకం ఊగిపోయింది. ఆయన మాటలకు పొంగిపోయింది. ఆయన ఇచ్చిన పిలుపును అందుకోవటానికి ఉవ్విళ్ళూరింది.


                పవనిజం ఏమిటి? జనసేన సిద్ధాంతాలు ఏమిటి? తెలియదనే వారు కొందరైతే, అర్థం కాలేదనే వారు మరికొందరు. అన్న చిరంజీవి కూడా మాస్ పుల్లరే. ఇలాంటి వారి వెంట జనాలు నడుస్తున్నట్లు కనిపిస్తారే కాని అవసరమైనప్పుడు యాక్షన్ లోకి దిగరనే రాజకీయ నేతలు కూడా వున్నారు. ఎవరేమనుకున్నా కాకినాడ సభలో పవన్ మాటల్లో మాత్రం పూర్తి స్థాయి క్లారిటీ వుందని, ఆయన చట్టసభలకు వెళ్ళిన ప్రజాప్రతినిథులు ఏమి చేయాలి? వారు విఫలమైతే బయటను నుంచి ఎలా స్పందించాలన్న దానిపై విస్పష్టంగానే మాట్లాడారని జనసేన సైనికులు అభిప్రాయపడుతున్నారు. ఎవ్వరిపై వ్యక్తిగతంగా ఎక్కువా మాట్లాడలేదు, అలాగని తక్కువా మాట్లాడలేదన్నది పవన్ అభిమానుల భావన. తిరుపతి సభలో ప్రత్యేక హోదా సాధనపై తన అభిప్రాయాలను ప్రకటించిన పవన్ కాకినాడలో సభ పెడుతున్న విషయాన్ని కూడా అక్కడే బహిరంగ పరిచారు. దీనితో కాకినాడ సభలో ఆయన కార్యాచరణకు పిలుపునిస్తారన్న అభిప్రాయం సర్వత్రా నెలకొన్నది. బహుశా దానిని గ్రహించేనేమో పవన్ దానిపై స్ఫష్టత ఇస్తూ మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగులు, యువత తమ పనులు మానుకుని, భవిష్యత్తును చెడగొట్టుకుని బయటకు రావలసిన పనిలేదని, దానిని చేయటానికి చట్టసభల్లో కూర్చున్న వారు వున్నారని పవన్ అన్నారు. ప్రజాప్రతినిథులు తాము చేయాల్సిన పనిపట్ల మరింత స్పష్టంగా వుండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారనే అనుకోవాలి. అలా చేయలేమని వారు అనుకున్నప్పుడు జనసైన్యంతో కూడిన జనసేన ముందుకు వస్తుందని పవన్ బల్లగుద్దారు.
                 ప్రజలను ఉర్రూతలూగించే ఉపన్యాసాలు ఇచ్చి, రోడ్లపైకి తీసుకువచ్చి వారి బలిదానాలతో సాధించే వాటిపై పవన్‌కు ఒకింత వ్యతిరేకత వున్నట్లే అనిపిస్తోంది. సైన్యాన్ని నడిపే యోధుడు ముందుంటాడు. తన ప్రాణాలకన్నా, తన సైనికుల ప్రాణాలకే విలువనిస్తాడు. విజయంతో పాటు వీరమరణాల సంఖ్య అస్సలు లేకుండా వీలుకాకపోతే అతి తక్కువగా వుండేలా చూసుకోవటమూ ముఖ్యమేనని అనుకుంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఓ యోధుడిలానే అలోచిస్తున్నాడని పవన్ అభిమానులు అభిప్రాయం. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలర్పించిన వారి స్మారక స్థూపం నిర్మించి గౌరవించటాన్ని ప్రస్తావించిన పవన్ అదే సమయంలో ఆంధ్ర ఉద్యమంలో ప్రాణాలను అర్పించిన 400మందికి స్మారకం నిర్మించకపోవటాన్నీ ప్రస్తావించారు. దీనిని ఏ రాజకీయ నేతా పట్టించుకున్న దాఖలాలు లేకపోవటం ఓ విషాదమే. తమనేమీ అనలేదని చంకలు గుద్దుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు చేయాల్సిన పనుల్లో ఇది కూడా ఒకటని పవన్ చెప్పిన విషయం వారి తలకెక్కిందో లేదో చూడాలి మరి. అదే క్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిపై తనకున్న గౌరవాన్ని చాటుకుంటూనే ఆయనతో తలపడాల్సి వచ్చినందుకు మన్నింపును కోరుకున్న పవన్ తాను నమ్మిన పని చేయటానికి తాను ఏం వదులుకున్నాడో కూడా ప్రకటించాడు. అన్నీ వదులుకొమ్మని తాను అడగటం లేదని, కనీసం పది శాతమైనా పనిచేయండన్నదే తన విన్నపమని వినయంగానే కోరాడు.
              పవన్ కోసం కొబ్బరి చెట్టు మొవ్వలోకి ఎక్కిన వెర్రి అభిమానం... మూడు అంతస్థుల ఎత్తులో వున్న కిటికీ సన్ షేడ్ పైకి నీటిపైపును పట్టుకుని ఎగబాకి కూర్చున్న పిచ్చి ప్రేమ... రేకులు విరిగిపోతాయి, మీరు పడిపోతే పవన్ కన్నీరు పెడతాడంటూ నిర్వాహకులు బ్రతిమలాడితే, పవన్ కోసం ప్రాణాలు పోయినా ఫర్వాలేదు అంటూ సైగలు చేసిన ఉద్రేకం... తాడెత్తు నుంచి దిగబోయి జరిపోయిన ప్రాణం, కదలలేని గాయాలతో మంచమెక్కిన శరీరాలు పవన్ ఆత్మీయ స్పర్శకోసం తహతహలాడుతూనే వున్నాయి. బహుశా ఇది చూసి తట్టుకోలేకే అనుకుంటా ''దయ చేసి   నా సభలకు మీ పిల్లల్ని పంపించకండి, నా వల్ల మీరు మీ జీవితాలను నష్టపోవటం భరించలేను. నేను నా పోరాట రూపాన్ని మార్చుకుంటాను. ఏమి చేయాలో ఆలోచిస్తున్నానంటూ'' పవన్ చేతులెత్తి నమస్కారం చేస్తూ మరి చెప్పాడు. బహుశా ఆ మానవీయ దృక్కోణమే జై ఆంధ్ర ఉద్యమంలో వెంకయ్య నాయుడి ఉద్వేగభరతి ఉపన్యాసాలకు ఉద్రేకపడి కదనరంగంలోకి దూకి ప్రాణార్పన చేసిన వారిని స్మరించుకోవలసిన బాధ్యత గురించి మాట్లాడించి వుంటుందన్నది పరిశీలకుల అభిప్రాయం. కేంద్రంతో విరోధం పెంచుకుని సాధించేది ఏమీ వుండదు. అలాగని మోకాళ్లదండేసి సాగిలబడాల్సిన అవసమూ లేదు. రెండింటి మధ్యా ఒక సమన్వయ ధోరణి వుండాలన్న ఆలోచన పవన్ ఉపన్యాసంలో అంతర్లీనంగా సాగింది. యువత ఉపాధి అవకాశాలకల్పన కోసం పరిశ్రమలు రావాలి. అవి రావాలంటే ప్రత్యేక హోదా కావాలి. అన్న భావన ప్రస్ఫుటంగా కనిపించింది.
              అవును ఇప్పుడు ప్రభుత్వాలు ఆలోచించాల్సింది అదే. యువతకు ఉపాథి కల్పన సాధనకు ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి? దానిని ఎలా ప్రజలకు చేరవేయాలి? ఆ దిశగా సానుకూలంగా ఆలోచించకపోతే యువతశక్తి దిక్సూచిగా నిలబడ్డ పవన్ రేపు పెనుశక్తిగా మారతాడు. ఆయన మాటల్లోనే రాజ్యాధికారం కోసం కాకపోయినా తనను విపరీతంగా అభిమానించే యువతకోసమైనా ఆయన తిరిగి మరో రూపంలో ఉద్యమించే అవకాశాలు తక్కువగా ఏమీ లేవు.

నిజమే పవన్ కళ్యాణ్ తన అభిమానుల కోసమే కాదు తన దేశం కోసం పోరాడే యోధుడు .
ఆయన తన జనం కోసం చేసే పోరాటం లో విజయం సాధించాలని కోరుకుందాం .
జై హింద్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This is Atomic

All the pages you see here are built with the sections & elements included with Atomic. Import any page or this entire site to your own Oxygen installation in one click.
GET OXYGEN
linkedin facebook pinterest youtube rss twitter instagram facebook-blank rss-blank linkedin-blank pinterest youtube twitter instagram