November 21, 2024
 ఆడ... మగ తేడా లేకుండా విస్తరిస్తున్న వ్యసనం

 ఆడ... మగ తేడా లేకుండా విస్తరిస్తున్న వ్యసనం

                         
                                                     
  జూదం వలలో చిక్కుకు పోతున్న  వైనం గెలిచేదెవరు….?

 
  ఆడ… మగ తేడా లేకుండా విస్తరిస్తున్న వ్యసనం


ఆన్‌లైన్‌ గేమింగ్‌ పేరుతో సాగుతున్న జూదానికి బానిసలవుతున్నవాళ్ల సంఖ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా యువత, విద్యార్థులు, గృహిణులు ఆన్‌లైన్‌ పేకాటకు అలవాటు పడుతున్నారు.
రూ.వందల నుంచి రూ.వేల వరకూ పేకాటలో పెడుతుంటే… ఆన్‌లైన్‌ జూదం స్థాయి రూ. వందల కోట్లకు చేరుతోంది. గతేడాది మన దేశంలో ఈ తరహా వ్యాపార స్థాయి రూ.2,650 కోట్లుగా ఉంటే రాబోయే నాలుగేళ్లలో రూ.5,200 కోట్లకు చేరుతుందని ఫిక్కీ అంచనా! అంటే పేకాటఆడేవాళ్లు ఏ స్థాయిలో పెరగబోతున్నారో అర్థం చేసుకోవచ్చు. చేతిలో మొబైల్‌ ఉన్నాచాలు తమ ఆన్‌లైన్‌ రమ్మీ వెబ్‌సైట్‌ ద్వారా ఆడేసుకోవచ్చంటూ వూదరగొట్టే గేమింగ్‌ కంపెనీల ప్రకటనల వలలో జనం చిక్కుపడిపోతున్నారు. ఆన్‌లైన్‌ జూదానికి అలవాటుపడ్డవాళ్లు అదే లోకమన్నట్లు కంప్యూటర్‌ తెరలోకి తలదూర్చేస్తున్నారు. దీంతో కుటుంబ బంధాలు దెబ్బ తింటున్నాయి. అప్పుల్లో కూరుకుపోతున్నారు.


* విజయవాడకు చెందిన 40ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగి ఆరు నెలలుగా ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడేందుకు అలవాటుపడ్డాడు. ఆఫీసు నుంచి ఇంటికి రావటం ఆలస్యం కంప్యూటర్‌ ఆన్‌ చేసుకొని అర్ధరాత్రి వరకూ అదే పేకాట. తెల్లవారి లేచాక కూడా రెండు గంటలపాటు అదే ఆట. భోజనం, టిఫిన్‌ అన్నీ కంప్యూటర్‌ ముందే. గెలిచింది తక్కువ.. ఓడింది ఎక్కువ కావడంతో బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర రూ.లక్షలు అప్పులు చేసి నిండా మునిగాడు..
 
* హైదరాబాద్‌లో ఉన్నత కుటుంబానికి చెందిన మహిళ తన దగ్గర ఉన్న క్రెడిట్‌ కార్డుతో సరదాగా ఆన్‌లైన్‌లో రమ్మీ ఆట మొదలుపెట్టి వ్యసనంగా మార్చుకొంది. క్రెడిట్‌ కార్డు బిల్లు మోత మోగడంతో ఇంట్లో అసలు విషయం వెల్లడై గొడవలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో ఉద్యోగం వెదుక్కొనేందుకో, కొత్త కోర్సులు చేసేందుకో వచ్చిన యువకులు కొందరు వూరి నుంచి తెచ్చుకొన్న సొమ్ముతో ఆన్‌లైన్‌ పేకాడి ఇబ్బందులుపడుతున్నారు.


* తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యాపారికి పేకాడే అలవాటు ఉంది. క్రమంగా తన ఆఫీస్‌లో కూర్చొనే ఆన్‌లైన్‌లో ఆడటం మొదలుపెట్టాడు. వ్యాపారం మీద దృష్టి తగ్గడంతో దెబ్బ తినడంతో నష్టాల పాలయ్యాడు. ఇవి మచ్చుక్కి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
 
    కంప్యూటర్‌ తెర మీద పేకాట ఆడటం కొత్త ఏమీ కాదు. 1990 నుంచి దశకం నుంచీ ఉన్నదే. అయితే ముందుగా కంప్యూటర్‌లో లోడ్‌ చేసిన గేమ్‌ల్లో భాగంగా ఎవరికివాళ్లే కాలక్షేపానికి ఆడేవారు. ఇక్కడ డబ్బులు రావడం పోవడం అనే సమస్య ఉండేది కాదు.     ఇప్పుడు మనుషులు అదృశ్యంగా ఉంటారు తప్పించి ఆటంతా ప్రత్యక్షంగా కనిపించే స్థాయికి క్రమంగా గేమింగ్‌ పరిశ్రమ వృద్ధి చెందడంతో గత తొమ్మిదేళ్లుగా దేశంలో ఆన్‌లైన్‌లో రమ్మీ, మూడుముక్కలాటలాంటివి ఆడించే వెబ్‌సైట్లు వచ్చాయి.


  ఇటీవల కాలంలో ఇవి ఇబ్బడిముబ్బడిగా రావడమే కాకుండా టీవీల్లో, వెబ్‌సైట్లలో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు చేసుకోవడం ద్వారా మార్కెట్‌ పరిధిని పెంచుకొన్నాయి. పేకాడుకొనేందుకు భాగస్వాములు దొరకలేదా ఫర్వాలేదు మా వైబ్‌సైట్‌ ఉందని ఒకరు.. మీరు బాత్రూమ్‌లో ఉన్నా మొబైల్‌లో పేకాడుకోండి అనో.. కారులో వెళ్తూ కార్డ్స్‌ ఆడమనో ఇంకొరు చెబుతారు. 


  ఇంకా పాత తరహా చేత్తో పేకముక్కలు పట్టుకొని ఏం ఆడతారు కొత్త తరహాలోకి రమ్మని చెప్పే వెబ్‌సైట్‌ మరొకటి. నేను ఆన్‌లైన్‌లో పేకాడి బోలెడు గెలిచాను అంటూ ఒకరు… ఇలా జూదం వైపు ఆకట్టుకొనేలా సాగే ఈ ప్రకటనల్లో సినీ నటులు కూడా కనిపిస్తున్నారు. 


 ఈ వలలో చిక్కిన వారు రూ.10 నుంచి రూ.వందలు, రూ.వేలల్లో పేకాటలో పెడుతున్నారు. తాము పెడుతున్నది తక్కువ మొత్తంలా కొందరికి తొలుత అనిపించినా క్రమంగా భారీగా నష్టపోయామని తరవాత వాపోతున్నారు.
 
ఫ్రీ ఫ్రీ ఫ్రీ అంటూ ఎర..
ఆన్‌లైన్‌లో రమ్మీకి సంబంధించిన వెబ్‌సైట్లు ‘ఫ్రీ టు ప్లే’, ‘పే టు ప్లే’ రెండు ఆప్షన్లు ఇస్తున్నాయి ఉచితంగా కూడా పేకాట ఆడుకొనే వెసులుబాటు ఉంటుంది. తొలుత ఉచితంతో వూబిలోకి దించి క్రమంగా డబ్బులు పెట్టే స్థాయికి తీసుకెళ్లి ఇక అక్కడ నుంచి బయటపడలేని విధంగా పాతాళంలోకి అదిమేస్తాయి.
విద్యార్థులు, గృహిణులు, యువత ఎక్కువగా ఆడుతున్నారు. గత రెండేళ్లుగా ఆన్‌లైన్‌లో పేకాడేవాళ్ల సంఖ్య బాగా పెరిగినట్లు మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. క్రెడిట్‌/డెబిట్‌ కార్డులు వాడేవాళ్లు పెరగడం, విద్యార్థులకీ, గృహిణులకీ వీటిని ఇంట్లోవాళ్లు ఇవ్వడంతోపాటు మొబైల్‌లో యాప్‌లు ఉండటం, ఇంటర్నెట్‌ వాడే అవకాశం ఉండటం ఇందుకు దోహదపడ్డాయి.
 
వారాంతపు ఆకర్షణలు..
ఆన్‌లైన్‌లో పేకాడించే వెబ్‌సైట్లు జూదగాళ్లను ఆకట్టుకొనేందుకు రకరకాల స్కీమ్‌లు, ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వారాంతపు ఆకర్షణగా ఒక్కో గేమ్‌ రూ.5 వేలు అంటూ ప్రకటించేవి కొన్నయితే… మరికొన్ని దీపావళి ధమాకా అంటూ స్కీమ్‌లు పెడుతున్నాయి. ఆన్‌లైన్‌లో రమ్మీ టోర్నమెంట్‌ అంటూ భారీ బహుమతి మొత్తాల్ని కూడా ప్రకటిస్తున్నారు. దీంతో ఆన్‌లైన్‌ జూదగాళ్లు ఎగబడుతున్నారు. కొన్ని వెబ్‌సైట్లు
సింగపూర్‌లో రమ్మీ టోర్నమెంట్‌ ఆడొచ్చు అంటూ ప్రకటించాయి. దీంతో వెబ్‌సైట్‌ చూసేవాళ్లు పెరగడంతో మార్కెట్‌లో వాటి విలువ భారీగా పెరుగుతోంది.


ఆట గెలిచేదెవరు?
ఒకళ్లు హైదరాబాద్‌లో మరొకరు అమలాపురంలో ఇంకొరు సిడ్నీలో మరొకరు దిల్లీలో… ఎక్కడెక్కడి నుంచో ఆన్‌లైన్‌లోకి వచ్చి పేకలు పంచుకొంటారు. ఆడుతుంటారు. ఒకళ్లు గెలుస్తారు. అలా గెలిచినవాళ్లు ఎక్కడివాళ్లు? వాళ్ల అసలు పేరేమిటి? లాంటి వివరాలు తెలుసుకొందామంటే సాధ్యం కాదు. వెబ్‌సైట్‌ తరఫునే ఒకళ్లు ఆడుతుంటారని… వాళ్లే ఎక్కువ ఆటలు గెలుస్తుంటారనే అనుమానాన్ని ఆన్‌లైన్‌ జూదరులు వ్యక్తం చేస్తున్నారు. వైబ్‌సైట్‌వాళ్లకే అందరి ఆట, ముక్కలు చూసే అవకాశం ఉంటుందన్నది వాళ్ల సందేహం.
నిస్సిగ్గుగా టి.వి. సామజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తూ మరీ జనాల సొమ్ము బహిరంగంగా దోచుకొనే ఇలాంటి వ్యాపార సంస్థల నుంచి ప్రజల్ని మన దేశాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది..ఇకనైనా ప్రభుత్వాలు మేల్కొని ఈ దోపిడీ జూదాన్ని నిషేధించాల్సిందిగా కోరుకుంటూ…

జై హింద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *